అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి ఏ ఎస్ డీ డీ ఓటర్ల ఇళ్ల వద్దకే బీఎల్ఓలు.. ఆధారాలు చూపితే జాబితాలో పేరు నమోదు: కలెక్టర్ టి. నిశాంతి
Watch on:
▶️ YouTube
ఓటర్ల జాబితాలో అర్హులైన ఒక్కరి పేరు కూడా తొలగిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి. నిశాంతి అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఏ ఎస్ డీడీ కేటగిరీలో ఉన్న ఓటర్లకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్, బూత్ స్థాయి అధికారులు (బిఎల్ఓలు) ఆయా ఓటర్ల ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో వివరాలు పరిశీలిస్తారని తెలిపారు. ఓటర్లు తమ గుర్తింపు, నివాసానికి సంబంధించిన తగిన ఆధారాలు సమర్పిస్తే నిబంధనల ప్రకారం తుది ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలో అరకు నియోజకవర్గ పరిధిలో 33,656 మంది, పాడేరు నియోజకవర్గ పరిధిలో 29,602 మంది కలిపి మొత్తం 63,258 మందిని ఏ ఎస్ డీడీ కేటగిరీలో గుర్తించినట్లు వివరించారు. వీరిలో 34,792 మంది మరణించినవారు, 14,309 మంది శాశ్వతంగా వలస వెళ్లినవారు, 11,795 మంది ఇప్పటికే జాబితాలో ఉన్నవారు, 2,327 మంది ఆచూకీ లేనివారు, 35 మంది ఇతర కేటగిరీకి చెందినవారుగా గుర్తించారు.సవరించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 18 నుంచి 30 వరకు ఫారాల పంపిణీ, సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 10లోగా ఫారాల పరిష్కారం, డిసెంబర్ 15లోగా క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం పూర్తి చేసి, డిసెంబర్ 22, 2026న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు వెల్లడించారు.బీఎల్ఓలు ఇంటికి వచ్చినప్పుడు ఓటర్లు పూర్తి సహకారం అందించి, అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించాలని కలెక్టర్ కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు దక్కేలా ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.